Andhra Pradesh: ఆస్తులు అమ్ముకుని కోట్లు ఖర్చుపెట్టా, జైలుకు పోయా.. హిందూపురం టికెట్ నాకు ఇవ్వాల్సిందే!: వైసీపీ నేత నవీన్ నిశ్చల్

  • టీడీపీ వేధింపులతో ఊరు వదిలిపెట్టి పోయా
  • మైనారిటీలే నాకు రాజకీయ భిక్ష పెట్టారు
  • 2019లో హిందూపురం టికెట్ నాదే

అనంతపురం జిల్లా వైసీపీలో రాజకీయం రంజుగా మారింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ అధినేత జగన్ ఆయన్ను హిందూపురం నియోజకవర్గం ఇన్ చార్జీగా నియమించారు. దీంతో ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న వైసీపీ నేత నవీన్ నిశ్చల్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఐదేళ్లుగా పార్టీకి సేవ చేస్తుంటే తనకు అన్యాయం చేశారని వాపోయారు. నవీన్ నిశ్చల్ పార్టీ వీడతారన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో హిందూపురంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడారు.

హిందూపురంలో వైసీపీని ఐదేళ్లుగా బలోపేతం చేశాననీ, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని నవీన్ నిశ్చల్ తేల్చిచెప్పారు. మైనారిటీలు పెట్టిన భిక్షతోనే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నాననీ, వారి మేలును ఎన్నటికీ మర్చిపోనని తెలిపారు. ఘనీని నియోజకవర్గం ఇన్ చార్జీగా నియమించినా 2019 హిందూపురం టికెట్ తనకే దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హిందూపురంలో పార్టీకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాననీ, ఇళ్లు ఆస్తులు అమ్ముకున్నానని గుర్తుచేశారు. టీడీపీ నేతలు తనను జైలుపాలు చేసినా పార్టీని వీడలేదన్నారు. వేధింపులు తాళలేక ఊరిని సైతం విడిచిపెట్టి వెళ్లాను తప్ప పార్టీ ఫిరాయించలేదన్నారు. అలాంటిది తనను కాదని మరొకరికి టికెట్ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

More Telugu News