Vijay Mallya: ఇండియాకు కావాల్సింది డబ్బు కాదు... నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టడమే: విజయ్ మాల్యా

  • ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న మాల్యా
  • ఇండియాకు వెళ్లాల్సిందేనని కోర్టు తీర్పు
  • హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్న మాల్యా
  • తన ప్రతి ఆఫర్ నూ తిరస్కరిస్తున్నారని ఆరోపణ

తనను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టాలన్న ఉద్దేశమే తప్ప, తాను బకాయి పడ్డ డబ్బును తిరిగి వెనక్కు తీసుకోవాలన్న ఉద్దేశం ఇండియాకు లేదని యూబీ గ్రూప్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన ఆయన, ఇండియాకు వెళ్లి తీరాలని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో, ఓ మీడియా సంస్థకు మాల్యా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

లండన్ కోర్టు తీర్పుపై అపీలు చేసే ఆలోచనలో తానున్నానని, తన న్యాయవాదులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని మాల్యా వ్యాఖ్యానించారు. తాను బకాయిపడ్డ రుణాలను సెటిల్ చేసుకునేందుకు 2016 నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నానని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా తెలియజేశానని మాల్యా వ్యాఖ్యానించారు.

తానిచ్చిన ప్రతి ఆఫర్ నూ తిరస్కరించాలని సీబీఐ, ఈడీలు బ్యాంకులపై ఒత్తిడి తెచ్చాయని ఆరోపించారు. బ్యాంకులు, ఈడీ తన ఆస్తుల కోసం కొట్టుకుంటున్నందున, సెటిల్ మెంట్ ఆఫర్ ను కర్ణాటక హైకోర్టు ముందు ఉంచానని, కోర్టే తన ఆస్తులను విక్రయించి, బ్యాంకులకు బకాయిలను, ఉద్యోగులకు వేతనాలను చెల్లించుకోవచ్చని తెలిపారు.

తన ఆస్తులను విక్రయించి బకాయిలను వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు లేవని ఆరోపించిన ఆయన, తాను 1988 నుంచి ప్రవాస భారతీయుడినేనని, యూకేలో 1992 నుంచి శాశ్వత నివాస హోదాను కలిగివున్నానని గుర్తు చేశారు. 2002లో తాను పార్లమెంట్ కు వెళ్లిన వేళ, బీజేపీ ప్రశ్నించిందని, ఎన్నారైగా ఉంటూ ఎలా కాలు మోపుతారని కోర్టును కూడా ఆశ్రయించిందని అన్నారు. ఆ కేసుల్లో తాను గెలిచానని గుర్తు చేశారు. తనలాగే పారిపోయిన లలిత్ మోదీపై కామెంట్ చేయలేనని, నీరవ్ మోదీ కేసు గురించి తన వద్ద సమాచారం లేదని మాల్యా పేర్కొన్నారు.

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన కేసులో తనను పోస్టర్ బాయ్ గా మార్చారని, చాలా మంది ఎగ్గొట్టినా, డబ్బులు తిరిగి చెల్లిస్తానంటున్న తనను మాత్రమే టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. రుణాలన్నీ తిరిగి చెల్లించడానికి అవసరమైనంత డబ్బు, ఆస్తులు తన వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News