Andhra Pradesh: పెథాయ్ ఎఫెక్ట్.. డ్రోన్ బృందాలను రంగంలోకి దించిన ఏపీ ప్రభుత్వం!

  • రేపు కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం
  • ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న అధికారులు
  • తూర్పుగోదావరిలో 50 పునరావాస కేంద్రాల ఏర్పాటు

నాలుగురోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తాజాగా పెథాయ్ తుపాను రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిత్లీ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అన్ని కోస్తా జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్ లైన్లు ఏర్పాటుచేసిన అధికారులు, ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అధికారులు ఇక్కడ 50 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు. అధికారులతో పాటు సిబ్బందికి సెలవులను రద్దుచేశారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం, ఆచంట, యలమంచిలి మండలాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాగా, పెథాయ్ తుపాను ప్రభావంతో నేటి సాయంత్రం నుంచి కోస్తాంధ్రలో వర్షాలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా తుపాను సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 25 డ్రోన్ బృందాలను ఏపీ ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. పెథాయ్ రేపు కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

More Telugu News