ranjita: నా ఫేస్ బుక్ లో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు!: నటి రంజిత ఆవేదన

  • శబరిమలలో ప్రశాంతతను దెబ్బతీశారు
  • వ్యతిరేకించినందుకు దూషిస్తున్నారు
  • ఇవన్నీ క్రిమినల్ చర్యలేనని వ్యాఖ్య

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు వెళ్లవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించగా, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. స్త్రీలు శబరిమలకు వెళ్లరాదని పలువురు మహిళలు సైతం ఆందోళనకు దిగారు. వీరిలో ప్రముఖ నటి రంజిత కూడా ఉన్నారు. తాజాగా శబరిమలకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలపై రంజిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భక్తులకు సంబంధించిన అంశాలను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వీరి కారణంగా నిజమైన భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతీమాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడాన్ని రంజిత సమర్థించారు. తాను అరెస్టును సమర్థించడంతో కొందరు ‘ఒక స్త్రీ అయ్యుండి సాటి మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతావా?’ అని పోస్టులు పెడుతున్నారని తెలిపారు.

మరికొందరు శబరిమలకు వెళ్లేముందు తన ఫేస్ బుక్ లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు క్రిమినల్ చర్యల కిందకు రావా? అని రంజిత ప్రశ్నించారు.

More Telugu News