Hyderabad: దొంగతనాల బాట పట్టిన రాష్ట్రస్థాయి బాక్సర్

  • కుటుంబం కోసం అప్పులు
  • వాటిని తీర్చేందుకు చోరీలు
  • బాక్సర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న యువకుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ చోరీల బాట పట్టాడు. గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న అతడిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన కోన నర్సింగరావు (34) బాక్సర్. గతంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పలుమార్లు పాల్గొన్నాడు. తండ్రి ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకున్న నర్సింగ్ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి బాక్సింగ్ శిక్షకుడిగా చేరాడు. మరోవైపు కార్లను లీజుకు తీసుకుని తిప్పేవాడు.

ఇన్ని చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండడంతో అప్పులు చేసేవాడు. వాటిని తీర్చేందుకు చోరీల బాట పట్టాడు. ఇందుకోసం ముందుగా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకునేవాడు. అనంతరం బైక్ నంబరు ప్లేటు మార్చి రంగంలోకి దిగేవాడు. ఇలా ఏడు నెలల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. శుక్రవారం అనుమానాస్పదంగా కనిపించిన నర్సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. అతడి నుంచి పదహారున్నర తులాల బంగారు గొలుసులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News