Visakhapatnam District: కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్య కేసు ఛేదనకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ

  • సెప్టెంబరు 23న హత్యకు గురైన కిడారి, సివేరి సోమ
  • అడ్డగించి కాల్చి చంపిన మావోలు
  • తాజాగా కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల కేసును ఛేదించేందుకు జాతీయ దర్యప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తుండగా, ఇప్పుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. తీవ్రవాద, ఉగ్రవాద మూలాలున్న కేసులు దేశంలో ఎక్కడ నమోదైనా వాటిని జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుంటుంది. అందులో భాగంగానే ఈ కేసును విచారించేందుకు ముందుకొచ్చింది.

సెప్టెంబరు 23న గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు వెళ్తుండగా డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు వారిని అడ్డగించి తుపాకులతో కాల్చి చంపడం అప్పట్లో సంచలనమైంది. కాగా,  ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని ఎన్ఐఏ పోలీస్ స్టేషన్‌లో ఈ హత్యోదంతంపై కేసు నమోదైంది.

 దీంతో రెండు రోజుల క్రితం ఎన్ఐఏ ఎస్పీ విశాఖ వచ్చి ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను సిట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీకి వెళ్లి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కోసం విశాఖలో తాత్కాలికంగా ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎన్ఐఏ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News