TRS: సాగునీటి ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం
  • నిర్మాణ పనుల్లో ఎక్కడా అలసత్వం, జాప్యం వద్దు
  • ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశాలు

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా చూడాలని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. ప్రాజెక్టు పనుల నివేదికలను సమీక్షించిన కేసీఆర్, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలని అన్నారు.

 సీతారామ, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతుండటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం వెంటనే చెల్లించాలని, నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వాటి గురించి కేసీఆర్ ఆరా తీశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్, పంప్ హౌస్ లను, ప్రాజెక్టుల నిర్మాణాలను కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. ఆయా ప్రాంతాలకు ఆయన మంగళవారం వెళ్లనున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పునరుజ్జీవన పథకం కింద చేపట్టిన పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.  

More Telugu News