Andhra Pradesh: వైసీపీ మండపేట నియోజకవర్గం ఇన్ చార్జీగా ‘పితాని’ నియామకం!

  • పార్టీ సమావేశం నిర్వహించిన పితాని అన్నవరం
  • టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్న చంద్రబోస్
  • అన్నవరం విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్‌గా డాక్టర్‌ పితాని అన్నవరంను నియమించింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని తెలిపారు. మండపేట నియోజకవర్గంలో డాక్టర్‌ పితాని అన్నవరం విజయం కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పితాని అన్నవరం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ..  టీడీపీ పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో టీడీపీ ఏపీ ప్రజలను మోసం చేసిందన్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకోసం తహతహలాడుతోందని విమర్శించారు. కాగా, ఈ కార్యక్రమంలో పితాని అన్నవరం మాట్లాడుతూ. తాను అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు నాయకులు, కార్యకర్తలు అంతా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు, గంగుమళ్ల రాంబాబు, మేడిశెట్టి సూర్య భాస్కరరావు, పిళ్లా వీరబాబు, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More Telugu News