Telangana: ‘కంప్యూటర్లు, ఫోన్లను నేనే కనిబెట్టా’ అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు!: కేటీఆర్ ఎద్దేవా

  • చాలా విషయాలకు ఆయన క్రెడిట్ తీసుకుంటారు
  • కేసీఆర్ పై ప్రజలు అఖండ విశ్వాసం ఉంచారు
  • మహాకూటమిని, బీజేపీని తిరస్కరించారు

పర్సనల్ కంప్యూటర్లను తానే కనిబెట్టాననీ, సెల్ ఫోన్లను తానే తీసుకొచ్చానని ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే కాకుండా ఇంకా చాలా పనులను తానే చేసినట్లు ఆయన క్రెడిట్ తీసుకుంటూ ఉంటారనీ, దాన్ని చంద్రబాబుకే వదిలివేస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పాటు 11 మంది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ హేమాహేమీ నేతలు రంగంలోకి దిగినా, తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ పై విశ్వాసం ఉంచారని వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈరోజు నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై అపార విశ్వాసం ఉంచారనీ, దాదాపు 88 స్థానాల్లో అఖండ విజయం అందించారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటిని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణకు బయ్యారం స్టీల్ ప్లాంట్, పాలమూరు ప్రాజెక్టు సహా పలు అంశాల్లో మోసం చేసిన బీజేపీకి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారనీ, 103 స్థానాల్లో డిపాజిట్లు దక్కకుండా ఓడించారని వ్యాఖ్యానించారు.

More Telugu News