Telangana: లగడపాటి రాజగోపాల్ సర్వేపై సెటైర్లు వేసిన కేటీఆర్!

  • లగడపాటి విచిత్రమైన సర్వేను ఇచ్చారు
  • సర్వే దెబ్బకు కాంగ్రెస్ నేతలు ఇంకా కోలుకోలేదు
  • ఆ మీడియా పెద్దలు ఇప్పటికైనా మారితే మంచిది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోని మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు ఇస్తే, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం టీఆర్ఎస్ ఓడిపోతుందని విచిత్రమైన సర్వేను ఇచ్చారని  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన అంచనాలు తప్పడంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై పడ్డారని ఎద్దేవా చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వేకు మహాకూటమి నేతలు నోస్ట్రడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన భవిష్య వాణి రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలను కన్వీన్స్(ఒప్పించలేని) చేయలేని కొన్ని మీడియా సంస్థలు కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. ప్రజలను నమ్మించాలని యత్నించినప్పటికీ వాళ్లు తిరస్కరించారని తెలిపారు. ఇప్పటికైనా తమను తాము సంస్కరించుకుని ప్రజల సమస్యలపై నిజాయతీగా వార్తలు రాయాలని ఆ మీడియా పెద్దలకు సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా టీఆర్ఎస్ బలంగా నిలబడేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికల్లో విష ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టారు కాబట్టే ఎన్నికల్లో తాము విజయం సాధించగలిగామన్నారు. టీఆర్ఎస్ ను స్థానిక, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేలా మారుస్తామనీ, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో ఈసారి యువతకు ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ అన్నారు.

More Telugu News