Telangana: 2019లో కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదు.. టీఆర్ఎస్ కీలకంగా మారబోతోంది!: కేటీఆర్

  • కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
  • కేంద్రం నుంచి భారీగా నిధులు సాధించుకోవచ్చు
  • గెలిచే ప్రతీ ఎంపీ స్థానం కీలకంగా మారబోతోంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమకు గొప్ప బాధ్యతను అప్పగించారనీ, దాన్ని నిలబెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. మహాకూటమి (ప్రజాకూటమి) పేరుతో ప్రజల ముందుకు వచ్చిన ప్రతిపక్షాలను వారు తిరస్కరించారని పేర్కొన్నారు.

తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నా, లేకపోయినా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తన బాధ్యత అని వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

2014తో పోల్చుకుంటే బీజేపీ పరిస్థితి మారిపోయిందనీ, ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 2019లో రెట్టింపు స్థాయి సీట్లు గెలుస్తుందని అనుకున్నా మొత్తం 100 స్థానాలు కూడా దాటవన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మరో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని, అలాంటప్పుడు ప్రతీ ఎంపీ స్థానం కీలకంగా మారుతుందని వెల్లడించారు.

ఈసారి బీజేపీ లేదా కాంగ్రెస్ రెండూ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఈసారి టీఆర్ఎస్ కు 16 స్థానాలు అప్పగిస్తే, కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టులను సాధిస్తామనీ, రూ.40,000-రూ.50,000 కోట్లు సాధించుకోగలమని వ్యాఖ్యానించారు. ఇలాంటి బంగారు అవకాశం తెలంగాణ ప్రజల ముందు ఉందని తెలిపారు. బీజేపీకి పార్లమెంటులో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతోనే బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్ పార్క్, పాలమూరుకు జాతీయ హోదా సహా ఏ డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదన్నారు.

More Telugu News