Telangana: తెలంగాణలో వచ్చింది శబ్ద విప్లవమే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి గూబ గుయ్యిమనేలా ఫలితాలు వచ్చాయి!: కేటీఆర్

  • టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేస్తాం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాదే
  • 16 సీట్లు అప్పగిస్తే ఢిల్లీలో ప్రధానిని నిర్ణయిస్తాం

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఓ రాజకీయ పార్టీగా పటిష్టం కావాల్సిన అవసరం ఉందని  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ మరో 100 సంవత్సరాల పాటు నిలిచేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ, వీటిలోనూ టీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈరోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ టీఆర్ఎస్ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. తాను గత 12 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాననీ, నాలుగు ఎన్నికలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నానని తెలిపారు. టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాలేదనీ, శబ్ద విప్లవమే వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ శబ్ద విప్లవం దెబ్బకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ప్రతిపక్షాల గూబ గుయ్యిమనిందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపడుతోందని చెప్పారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్ కు కట్టబెడితే.. ఢిల్లీలో ప్రధాని ఎవరు కావాలి? అన్నదాన్ని నిర్ణయిస్తామని కేటీఆర్ అన్నారు. తెలంగాణను దేశానికి దిక్సూచీగా మార్చే బంగారు అవకాశం రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉందని తెలిపారు.

More Telugu News