Telangana: ఏటీఎం కార్డు, చిన్న తాళంతో ఎస్ బీఐ నుంచి రూ.14 లక్షలకు పైగా కొల్లగొట్టిన యువకుడు!

  • సికింద్రాబాద్ లోని ప్యాట్నీ సెంటర్ లో ఘటన
  • ఏటీఎంను తాళంతో తెరిచి క్యాష్ విత్ డ్రా
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఏటీఎంలు ఎలా పనిచేస్తాయో, వాటిలోని లోపాలు ఏమిటో తెలుసుకున్న ఓ యువకుడు రెచ్చిపోయాడు. నగదు డ్రా చేసే సమయంలో కరెక్టుగా విద్యుత్ ను ఆపేసి డబ్బులు తీసుకునేవాడు. ఇలా ఒకటి.. రెండు.. కాదు ఏకంగా లక్షల మేర బ్యాంకుకు టోకరా పెట్టాడు. అయితే ఆడిట్ సమయంలో నగదు నిల్వల్లో తేడా వస్తుండటంతో ఏటీఎం సీసీటీవీలను పరిశీలించిన అధికారులు విస్తుపోయారు. ఈ ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ)తన బ్రాంచ్ ఏటీఎంను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏటీఎంలోకి వచ్చిన ఓ ప్రబుద్ధుడు నగదును డ్రా చేయడానికి కొత్త విధానాన్ని పాటించాడు. సాధారణంగా నగదు ఏటీఎం నుంచి బయటకు వస్తేనే బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుంది. అయితే నిందితుడు మాత్రం ఏటీఎం కార్డును తొలుత స్వైప్ చేసేవాడు. అనంతరం నగదు బయటకు వచ్చేముందు తన వద్ద ఉన్న ప్రత్యేక తాళంతో మెషీన్ ను స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఆ తర్వాత నగదును లోపలి నుంచి తీసుకుని ఏటీఎంను మళ్లీ ఆన్ చేసేవాడు. దీంతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తగ్గేవి కావు.

ఇలా నిందితుడు ఎస్ బీఐ ఏటీఎం నుంచి రూ.14,72,500ను కొల్లగొట్టాడు. అయితే ఇటీవల నిర్వహించిన ఆడిట్ లో డిపాజిట్ కు, విత్ డ్రాకు మధ్య భారీగా తేడా ఉండటాన్ని గమనించిన అధికారులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఏటీఎంను తెరవడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అడ్రస్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇతను గతంలో ఏటీఎంల్లో నగదు నింపే కంపెనీలో పనిచేసి ఉంటాడనీ, అందువల్లే ఇంత భారీ స్థాయిలో మోసం చేయగలిగాడని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News