modi: మోదీకి పోటీ ఎవరు?.. నా సమాధానం ఇదే!: తేజస్వి యాదవ్

  • మోదీకి ఆయన ఇచ్చిన హామీలే పోటీ
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ, అమిత్ షాలకు షాకే
  • మోదీ మరోసారి ప్రధాని అయితే.. రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని మోదీ, బీజేపీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైందని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, శాసనసభలో ఆర్జేడీ పక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిన బీజేపీపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికల ఫలితాలు వారికి పెద్ద ఎదురు దెబ్బేనని అన్నారు. వీరిద్దరూ ఈ ఫలితాలతో ఎంతో డిస్టర్బ్ అయ్యారని చెప్పారు. గత బుధవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయో ఎవరైనా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.

'అత్యంత కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధినేత రాహుల్, ఆ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు. రానున్న లోక్ సభ ఎన్నికల తర్వాత మోదీ, అమిత్ షాలు గత చరిత్రగా మారిపోతారు. మోదీకి పోటీ ఎవరూ లేరని బీజేపీ ఇప్పటికీ భావిస్తోంది. మోదీ వర్సెస్ ఎవరు? అని ప్రశ్నిస్తోంది. 60 ఏళ్లు ఇతరులు పాలించారు... 60 నెలలు పాలించే అవకాశం మాకు ఇవ్వండని వారు అధికారంలోకి వచ్చారు. 2 కోట్ల మందికి ఉద్యోగాల కల్పన, విదేశాల నుంచి బ్లాక్ మనీని వెనక్కి రప్పించడం, రైతుల సమస్యల పరిష్కారంలాంటి మీ హామీలు ఏమయ్యాయి? మోదీ వర్సెస్ ఎవరు? అనే ప్రశ్నకు నా సమాధానం ఇదే. మోదీ వర్సెస్ అతని హామీలు.

అంతులేని అహంకారంతో, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు రాజ్యాంగ వ్యవస్థలను కూడా వాడుకుంటున్నారు. ఇప్పటికే దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. ఆర్బీఐ, సీబీఐ, మీడియా తదితర రంగాలతో ఆడుకున్నారు. మరోసారి మోదీ ప్రధాని అయితే... ఆయనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని కూడా మార్చుకుంటారు.

మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న మహాకూటమి విజయవంతమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా లేని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను (వారి అజెండాలను) రాహుల్ గాంధీ సరైన రీతిలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలను ముందు వరుసలో నిలబెట్టాలి. ఎక్కువ ఓట్లను సాధించే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. కూటమి విజయంపైనే మేము దృష్టి సారించాం. ఈ నేపథ్యంలో, రాష్ట్రాల వారీగా, సీట్ల పరంగా సరైన దిశగా ముందడుగు వేయడం సంకీర్ణ కూటమికి చాలా ముఖ్యం'. 

More Telugu News