KCR: కేటీఆర్‌కు 'కార్యనిర్వాహక అధ్యక్ష పదవి'ని స్వాగతించిన పార్టీ శ్రేణులు

  • హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలు
  • ఢిల్లీ వైపు అడుగులు వేసేందుకే సీఎం నిర్ణయమన్న అభిప్రాయం
  • రాష్ట్రంలో నమ్మకస్తుడు కావాల్సి రావడంతో కొడుకుకు పగ్గాలని వ్యాఖ్య

గెలిచిన వెంటనే తొలి మీడియా సమావేశంలోనే దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర  ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు నడుం బిగిస్తానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అ దిశగా అడుగు వేయనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షునిగా తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరామారావు నియామకం ఇందుకు నాంది అని భావిస్తున్నారు. మరోపక్క, కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తు.చ తప్పకుండా అమలుచేయడంతోపాటు, ఇప్పటికే ప్రారంభించిన ఆయా ప్రాజెక్టులను కొనసాగించాల్సిన బాధ్యత తనపై ఉన్నందున తనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి కావాలన్న ఉద్దేశంతోనే సమర్థుడైన కేటీఆర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మరోవైపు కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతోనే పార్టీ శ్రేణులు ప్రగతి భవన్‌కు క్యూకట్టాయి.

పలువురు ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో కేటీఆర్‌ పడ్డ కష్టాన్ని కేసీఆర్‌ గుర్తించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతానికి కూడా ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కేసీఆర్‌ నిర్ణయంపై ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News