Khammam District: ఊపిరున్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేల స్పష్టీకరణ!

  • పార్టీ మారుతున్నామన్న వార్తలన్నీ ఊహాగానాలే
  • సామాజిక మాధ్యమాల్లో వదంతులే షికార్‌ చేస్తున్నాయి
  • అమ్ముడు పోయే నైజం మాకు లేదు

పార్టీ మారుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ ఊహాగానాలేనని, పార్టీ మారే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు తాము కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు వేర్వేరుగా మాట్లాడుతూ అధికార పార్టీ ఇచ్చే తాయిలాలకు తలొగ్గి పార్టీ మారుతామని అనుకోవడం ఒట్టి భ్రమేనన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కావాలని ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమను ఎన్నుకుని అసెంబ్లీకి పంపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, వారి రుణం తీర్చుకునేందుకు శ్రమిస్తామని తెలిపారు.

అవాస్తవాలను ప్రచారం చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘కష్టకాంలోనే నేను పార్టీని విడిచి పెట్టలేదు. 2009, 2014లో వరుసగా ములుగు నియోజకవర్గం నుంచి ఓడిపోయినా పార్టీ వీడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎందుకు పార్టీ మారుతాను?’ అని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు.

More Telugu News