Indian Techchie: విమానంలో లైంగిక దాడి చేసిన భారత టెక్కీకి 9 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు

  • జనవరి 3న విమానంలో ఘటన
  • నిద్రిస్తున్న ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు
  • శిక్ష పూర్తికాగానే ఇండియాకు పంపించేయాలన్న కోర్టు

ఈ సంవత్సరం ప్రారంభంలో విమానంలో ప్రయాణిస్తూ, సహ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన తమిళనాడు టెక్కీ ప్రభూ రామ్మూర్తి (35)కి 9 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ, అమెరికాలోని డెట్రాయిట్ కోర్టు తీర్పిచ్చింది. ఈ శిక్షను అనుభవించిన తరువాత అతన్ని ఇండియాకు డిపోర్ట్ చేయాలని పేర్కొంది.

2015లో హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చిన రామ్మూర్తి, విమానంలో అత్యంత హేయంగా ప్రవర్తించాడనటానికి ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి టెర్రెన్స్ బెర్గే అభిప్రాయపడ్డారు. అతన్ని కఠినంగా శిక్షిస్తే, ఈ తరహా నేరాలు చేసేందుకు పురుషులు భయపడతారని శిక్షను ఖరారు చేస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. "విమానాల్లో సురక్షితంగా ప్రయాణించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. మన ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదు. ఈ కేసులో ధైర్యంగా తనకు ఎదురైన అనుభవాన్ని కోర్టుముందు చెప్పిన బాధితురాలిని అభినందిస్తున్నా" అని ఆయన అన్నారు.

కాగా, జనవరి 3న లాస్ వెగాస్ నుంచి డెట్రాయిట్ కు బాధితురాలు ప్రయాణిస్తూ, నిద్రలోకి జారుకున్న వేళ, పక్క సీట్లోనే ఉన్న రామ్మూర్తి దారుణ చర్యకు దిగాడు. ఆమె లోదుస్తులను తొలగించాడు. ఆమెను తాకరాని చోట తాకాడు. విమానంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆమె గాఢమైన నిద్రలో ఉండటంతో చాలా సేపు తనపై జరుగుతున్న లైంగిక వేధింపులను పసిగట్టలేకపోయింది. నిద్ర నుంచి మేలుకున్న తరువాత, తన ప్యాంట్ బటన్స్ ఊడిపోయాయని, డ్రస్ కు ఉన్న జిప్ తొలగించబడిందని, లో దుస్తులు కదిలాయని ఆమె గుర్తించి, విమాన సిబ్బందిని అలర్ట్ చేసింది. దీంతో రామ్మూర్తిపై కేసు నమోదు కాగా, ఆగస్టులో విచారణ మొదలై అతన్ని దోషిగా న్యాయస్థానం గుర్తించి శిక్షను విధించింది.

More Telugu News