KCR: మీకు తెలుసా?... గత 18 ఏళ్లుగా మహమూద్ అలీ ఇంట్లో కేసీఆర్ కోసం ఓ ప్రత్యేక గది!

  • 2001 నుంచి కేసీఆర్ తో కలిసున్న మహమూద్ అలీ
  • కేసీఆర్ అంటే అమితమైన అభిమానాన్ని చూపే మహమూద్
  • ఎమ్మెల్యే కాకున్నా ఉప ముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్
  • రెండోసారి మంత్రిగా ఎంపిక చేసుకున్న కేసీఆర్

మహమూద్ అలీ... కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన వేళ ఉప ముఖ్యమంత్రి. రెండోసారి కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ, ఆయనతో పాటు మంత్రిగా ప్రమాణం చేసిన ఏకైక వ్యక్తి. ఆ వెంటనే అత్యంత కీలకమైన హోమ్ శాఖ మంత్రిగా నియమితులైన వ్యక్తి. మహమూద్ అలీకి అంతగా ప్రాధాన్యం ఇస్తారు కేసీఆర్. కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొన్న వేళ, తనతో పాటు ప్రమాణ స్వీకారానికి అలీని మాత్రమే ఎంచుకోవడం వీరిద్దరి మధ్యా ఉన్న బంధాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

హైదరాబాద్ పరిధిలోని ఆజంపురలో నివాసం ఉండే మహమూద్‌ అలీ, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రారంభించినప్పుడే పార్టీలో చేరారు. కేసీఆర్ తో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన చురుకుదనాన్ని చూసిన కేసీఆర్, తొలుత మైనారిటీ విభాగం బాధ్యతలు ఇచ్చారు. ఆపై 2014లో తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయగా, ఎమ్మెల్యే కూడా కాని మహమూద్ అలీని ఉప ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు కేసీఆర్. ఆపై ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు.

ఇక తరచూ కేసీఆర్, మహమూద్ అలీ ఇంటికి వెళ్లి వస్తుంటారు. పండగలు వచ్చినా, పుట్టినరోజులు జరిగినా, అలీ ఇంట అతిథుల జాబితాలో కేసీఆర్ ఉండటం తప్పనిసరి. ఏవైనా కీలక అంశాలపై చర్చించాల్సి వస్తే, కేసీఆర్ నేరుగా అలీ ఇంటికి వెళుతుంటారు. మహమూద్‌ అలీ, తనకెంతో ఇష్టమైన కేసీఆర్ కోసం, 18 సంవత్సరాలుగా తన ఇంట్లో ఓ గదిని అందుబాటులో ఉంచుతారు.

కేసీఆర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ గదిని తెరుస్తారు. ఈ గదిలో టేబుల్, కుర్చీలు, గోడపై కేసీఆర్ చిత్రపటం ఉంటాయి. కేసీఆర్ వస్తున్నారని తెలియగానే, గదిని తెరిచి శుభ్రం చేస్తారు. ఆయన వెళ్లగానే గది తలుపులు మూసుకుపోతాయి. అంత అభిమానం చూపుతున్నారు కాబట్టే మహమూద్ అలీకి ఇప్పుడు ఇంత ఘనమైన గుర్తింపునిచ్చారు కేసీఆర్.

More Telugu News