Telangana: కాంగ్రెస్ దారుణ పరాజయానికి కారణాలివి: ఏఐసీసీకి రిపోర్టు రెడీ!

  • 99 సీట్లలో పోటీ చేసి 19 మాత్రమే గెలిచిన కాంగ్రెస్
  • అధిష్ఠానానికి రిపోర్టును తయారు చేసిన కుంతియా
  • పలు అంశాలు ఓటమికి కారణమయ్యాయని వెల్లడి!

రాహుల్ గాంధీ కాళ్లకు బలపం కట్టుకుని తిరిగి మరీ ప్రచారం చేశారు. సోనియాగాంధీ కూడా వచ్చి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కూడా తెలంగాణలో రోడ్ షోలు నిర్వహించారు. వీరితో పాటు విజయశాంతి, ఖుష్బూ వంటి సినీనటులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎంతోమంది ప్రచారం చేసినా, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 99 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాల నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, స్థానిక నేతలతో కలసి తయారు చేశారు. ఇందులోని వివరాల ప్రకారం...

'పొత్తుల ప్రక్రియ మరింత ముందుగా ముగించి ఉంటే బాగుండేదని నేతలు అభిప్రాయపడ్డారు. పొత్తు జాప్యం కారణంగా కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడటం పార్టీకి నష్టం జరిగింది. ఈ ప్రభావం కూటమిలోని మిగతా పార్టీలపైనా పడింది. అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం కూడా ఓటమికి కారణమే. కనీసం మరో 15 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించివుంటే బాగుండేది. కొన్నిచోట్ల సీనియర్ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా, బలమైన అభ్యర్థులను నిలపలేకపోయాం. పొత్తుల కారణంగా కనీసం 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమున్నా, వదులుకోవాల్సివచ్చింది.

రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సిన నేతలు ఎంతో మంది వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులే స్వయంగా ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. పీసీసీ తరఫున ఒక్క నేత కూడా వెళ్లకపోవడం తీవ్ర నష్టాన్ని కలిగించింది. పలు స్థానాల్లో కాంగ్రెస్ నేతలే ఇతర పార్టీల బీ-ఫామ్ లను పొంది బరిలో దిగడం కూడా కొన్ని సీట్లలో ఓటమికి కారణమైంది. మేనిఫెస్టోలో పెట్టిన ఎన్నో హామీలు క్షేత్ర స్థాయిలోకి చేరలేదు. కొన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులే లేకుండా ఎన్నికలకు వెళ్లాల్సి రావడం కూడా నష్టం కలిగించింది' అని ఈ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం.

More Telugu News