TTD: టీటీడీపై కేసులో హైకోర్టు తీర్పు పట్ల స్పందించిన రమణ దీక్షితులు!

  • 20 వేల మంది అర్చకులకు మేలు కలుగుతుంది
  • టీటీడీ నిర్ణయం తప్పని తేలింది
  • హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన రమణ దీక్షితులు

టీటీడీలో మీరాశీ కుటుంబాలకు చెందిన వంశపారంపర్య అర్చకులను పదవీ విరమణతో సంబంధం లేకుండా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాలను నమ్ముకుని ఉన్న 20 వేల మంది అర్చకులకు మేలు కలిగిస్తుందని చెప్పారు. కేవలం తనను తొలగించేందుకే మిరాశీ అర్చకులు అందర్నీ పదవీ విరమణ పేరిట తొలగించాలన్న నిర్ణయాన్ని టీటీడీ తీసుకుందని అన్నారు. టీటీడీ నిర్ణయం తప్పని ఇప్పుడు కోర్టు కూడా తేల్చిందని, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధిస్తుందని భావిస్తున్నానని అన్నారు.

కాగా, టీటీడీలో ప్రస్తుతం 52 మంది మిరాశీ అర్చకులు ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకుల్లో నలుగురు ప్రధాన అర్చకులు, ఆరుగురు అర్చకులను పదవీ విరమణ పేరుతో టీటీడీ ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ తిరుచానూరుకు చెందిన అర్చక స్వాములు హైకోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన ధర్మాసనం తీర్పిచ్చింది.

More Telugu News