India: జనాభా లెక్కన భారత్ ను ఇప్పటికే హిందూ దేశంగా ప్రకటించి ఉండాల్సింది!: మేఘాలయ హైకోర్టు జడ్జి షాకింగ్ వ్యాఖ్యలు

  • మేఘాలయ హైకోర్టులో విచిత్ర ఘటన
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జస్టిస్ సేన్
  • హిందువుల కోసం చట్టం చేయాలని సూచన

మేఘాలయ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవిభజన తర్వాత పాకిస్తాన్ తమను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుందనీ, భారత్ కూడా హిందూ రాజ్యంగా ప్రకటించుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కానీ అప్పటి పాలకులు ప్రజాస్వామ్య, లౌకికదేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఓ వ్యక్తికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయడానికి అధికారులు నిరాకరించిన కేసులో మేఘాలయ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఆర్ సేన్ ఈ మేరకు స్పందించారు.

భారతదేశ విభజన రక్తపాతంతో జరిగిందని సేన్ అన్నారు. అప్పుడు కట్టుబట్టలతో ఆస్తులను వదులుకుని సిక్కులు, హిందువులు భారత్ కు వచ్చారన్నారు. అయితే సిక్కులకు పునరావాస శిబిరాలు కల్పించిన ప్రభుత్వం హిందువులను మాత్రం పట్టించుకోలేదన్నారు. కాబట్టి భారత్ కు స్వాతంత్ర్యం అహింసతో కాకుండా హింస,రక్తపాతంతోనే వచ్చిందని సెలవిచ్చారు. ఇప్పటీకీ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఇస్లామిక్ దేశంగా మారేందుకు వీలులేదనీ, అలా జరిగితే విపత్కర పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు.

ఇలా జరగకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటారన్న నమ్మకం తనకు ఉందనీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ విషయంలో దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్న హిందువులకు భారత పౌరసత్వం దక్కేలా చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. దేశంలోని ముస్లిం సోదరులకు తాను వ్యతిరేకం కాదనీ, వాళ్లంతా దశాబ్దాలుగా చట్టాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభా రీత్యా భారత్ ను ఇప్పటికే హిందూ దేశంగా ప్రకటించి ఉండాల్సిందని పునరుద్ఘాటించారు. కాగా, జస్టిస్ సేన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

More Telugu News