Chegondi Hariramajogaiah: చంద్రబాబు చేసిన ఈ మూడూ పెద్ద తప్పులే... అధికారం దూరమవుతుంది!: హరిరామజోగయ్య విశ్లేషణ

  • ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తప్పుచేశారు
  • పవన్ తోనే కాపుల ఓట్లూ పోయాయి
  • కాంగ్రెస్ తో కలిస్తే ప్రజలు అంగీకరించరన్న చేగొండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు అతిపెద్ద తప్పులు చేశారని మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. ఏపీపై తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయన్న అంశాన్ని ఆయన విశ్లేషించారు. కేంద్రంలోని ఎన్డీయే నుంచి బయటకు రావడం చంద్రబాబు చేసిన తొలి తప్పిదమని, దీని ఫలితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయని అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ను దూరం చేసుకోవడం చంద్రబాబు రెండో తప్పిదమని, పవన్ తో పాటే టీడీపీకి అండగా ఉండే కాపుల్లో 90 శాతం మంది టీడీపీకి దూరమైనట్టేనని, ఇది టీడీపీ విజయావకాశాలను ప్రభావితం చేయనుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం మూడో తప్పని, రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని హరిరామజోగయ్య అన్నారు.

ఏపీలోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, టీడీపీకి వచ్చే సీట్లు కూడా రాబోవని అంచనా వేసిన ఆయన, తాను చేసిన అభివృద్ధి ఓట్ల రూపంలో రక్షిస్తుందని భావిస్తే, చంద్రబాబు నాలుగో తప్పు చేసినట్లవుతుందని, అధికారం దూరం కావడం ఖాయమని హెచ్చరించారు.

More Telugu News