Hyderabad: వీరు నిత్యం ప్రజలతో మమేకమయ్యే నాయకులు.. అందుకే మళ్లీ గెలిచారు!

  • హ్యాట్రిక్‌ వీరులు ఆ నలుగురు
  • నియోజకవర్గంలో నిత్యం కలయ తిరుగుతూ సమస్యలపై ఆరా
  • వాటి పరిష్కారానికి చొరవచూపి ప్రజల మన్నన

ప్రజా ప్రతినిధి అంటే జనాన్ని నమ్ముకునే వాడు. వారి అభ్యున్నతి కోసం కృషిచేసేవాడు. నిత్యం జనంతో మమేకమై, వారి ఈతిబాధల్లో తానున్నానంటూ మెలిగేవాడు. అటువంటి వారిని జనం గుండెల్లో పెట్టుకుంటారు. పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపిస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అటువంటి నాయకులు నలుగురు ఉన్నారు. హ్యాట్రిక్‌ విజయం సొంతం చేసుకున్న వీరంతా మాస్‌ నాయకులే.

మూడోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన మజ్లిస్‌ నాయకులు మౌజంఖాన్‌, అహ్మద్‌లను పరిశీలిస్తే జనంతో వారెంతగా మమేకమై ఉంటారో అర్థమవుతుంది. నిత్యం తమ నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో వీరు తిరుగుతుంటారు. పార్టీ కేంద్రకార్యాలయంలో శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటారు. అహ్మద్‌ బలా 2009లో మలక్‌పేట నుంచి తొలిసారి గెలిచారు.

2009 ఎన్నికల్లో బహదూర్‌పురా నుంచి మౌజంఖాన్‌ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ వీరిద్దరూ మళ్లీ విజయ కేతనం ఎగురవేశారు. ఇక, నగర శివారు నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టి.ప్రకాష్‌గౌడ్‌లు ఇదే కోవలోకి వస్తారు. వీరు ద్వితీయశ్రేణి నాయకులకు మండలాల బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు సమస్యలపై ఆరాతీస్తుంటారు. ప్రధాన సమస్యలైతే నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుపొందగా, మంచిరెడ్డి తీవ్రపోటీలో కూడా స్వల్ప మెజార్టీతో బయటపడడానికి ప్రజలతో దగ్గరై ఉండడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

More Telugu News