YSRCP: ఓటరు ఐడీని ఆధార్ తో అనుసంధానించండి: ఈసీని కోరిన వైసీపీ నేతలు

  • ఏపీ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి
  • తక్షణమే ఓటర్ల జాబితాను సవరించాలి
  • ఈసీ మా వినతిని పట్టించుకోకపోతే.. కోర్టును ఆశ్రయిస్తాం

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాను కలసి ఫిర్యాదు చేశారు. త్వరలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఓటర్ల జాబితాను తక్షణమే సవరించాలని కోరారు.

అనంతరం మీడియాతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో అవకతవకలు ఉన్నాయని, వాటిని సవరించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. ఆధార్ ను ఓటర్ ఐడీతో లింక్ చేస్తే... అక్రమాలు ఉండవని తెలిపారు. ఎవరైనా ఓటర్ల జాబితాను తారుమారు చేయాలని యత్నిస్తే చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. దీనికి సంబంధించి చట్టాన్ని సవరిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పారు. తమ వినతిని ఈసీ పట్టించుకోకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

More Telugu News