TRS: ఆ ఒక్క సీటూ తప్ప మిగతా పదహారూ ఖాతాలోకే... కేటీఆర్ తదుపరి టార్గెట్!

  • 16 ఎంపీ సీట్లను గెలుస్తాం
  • దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర
  • లోక్ సభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతే

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 16 చోట్ల గెలవడమే తమ తదుపరి లక్ష్యమని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, 16 ఎంపీ సీట్లను గెలవడం ద్వారా దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు. తెలంగాణలో 17 లోక్ సభ సీట్లుండగా, హైదరాబాద్ స్థానం మజ్లిస్ అధీనంలో దీర్ఘకాలంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ముస్లింల ఓట్లు అత్యధికంగా ఉండటంతో ఎంఐఎం అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అయిన నేపథ్యంలోనే కేటీఆర్ 16 సీట్లు లక్ష్యమని చెప్పడం గమనార్హం.

ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఉందని, కేంద్రంలోనూ ఇదే జరుగుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తరువాత తెలుగుదేశం ఉనికి గల్లంతవుతుందని అభిప్రాయపడ్డ ఆయన, ప్రతిపక్షాలన్నీ ఏకమైనా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేయలేకపోయాయని అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే తమకు ఓటు శాతం కూడా పెరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు.

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ల ప్రమేయం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా, ఎన్నో ప్రాంతీయ పార్టీల నేతలు కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ నేతలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, రాజస్థాన్‌ లోని ఈవీఎంలపై ఎందుకు అనుమానం రావట్లేదని ప్రశ్నించారు. 

More Telugu News