Chandrababu: నేడు విశాఖలో మెడ్‌టెక్‌ పార్క్‌ ప్రారంభం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

  • గాజువాక దరి పెదగంట్యాడ మండలం పెదమదీనాలో ఏర్పాటు
  • వైద్య ఉపకరణాల ఉత్పత్తికి దేశంలోనే తొట్టతొలి పార్క్‌
  • పలు ఇతర కార్యక్రమాలతోనూ ముఖ్యమంత్రి బిజీ

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ నగరంలో ఏర్పాటవుతున్న దేశంలోని తొట్ట తొలి వైద్య ఉపకరణాల ఉత్పాదక కేంద్రం మెడ్‌ టెక్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రారంభించనున్నారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతం గాజువాక దరి పెదగంట్యాడ మండలం పెదమదీనా పరిధిలో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు పలు అంశాలపై సదస్సులు జరగనున్నాయి. గురువారం ఉదయం 10.45 గంటలకు సీఎం పెదమదీనా చేరుకుంటారు. పార్క్‌ను ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం 1.45 గంటల వరకు పార్క్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన అబ్దుల్‌కలాం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొంటారు.

అనంతరం 2.40 గంటలకు కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు భీమిలి చేరుకుని అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చిట్టివలస జూట్‌ మిల్లు మైదానంలో ఐ హబ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జీవీఎంసీకి చెందిన పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు విమానంలో విజయవాడకు వెళ్తారు.

More Telugu News