TRS: సీఎంగా ప్రమాణం తరువాత... కేసీఆర్ మొదటి టార్గెట్ పంచాయతీ ఎన్నికలు!

  • నేడు సీఎంగా కేసీఆర్ పదవీ ప్రమాణం
  • క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ను సుస్థిరం చేయడమే లక్ష్యం
  • అతి త్వరలో నోటిఫై చేయనున్న ప్రభుత్వం

నేడు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేసీఆర్ వెంటనే స్థానిక ఎన్నికలపై దృష్టిని సారించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ను మరింత సుస్థిరం చేయాలంటే ఇదే సరైన సమయమని భావిస్తున్న ఆయన, అన్ని పంచాయతీలనూ కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేసీఆర్ తదుపరి టార్గెట్ ఇదేనని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

మరో వారం రోజుల్లో ఎన్నికలకు నోటిఫై చేయడం ద్వారా, మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిపించాలని గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికలను సాధ్యమైనంత త్వరలో జరిపించాలని భావిస్తున్న ఆయన, ఈ విషయంలో ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు తదితరులతో చర్చించి, స్థానిక నేతలను అప్రమత్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు జరగాలంటే, ప్రభుత్వం ఉండటం తప్పనిసరి కావడంతో, నేటి ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమవుతుందని తెలుస్తోంది.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని పంచాయతీలను కైవసం చేసుకునే బాధ్యతలు సంబంధిత ఎమ్మెల్యేలపై ఉంచిన కేసీఆర్, వాటిని కూడా సొంత ఎన్నికలుగా భావించి పార్టీ శ్రేణులను గెలిపించేలా చూడాలని ఆదేశించారు. ఆపై లోక్ సభ ఎన్నికలు, దాని తరువాత వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటేందుకు కృషి చేయాలని సూచించారు.

More Telugu News