CPM: ఫలించని సీపీఎం యత్నం... తెలంగాణ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ ప్రభావం అంతంతే!

  • చిన్నాచితకా 28 పార్టీలు ఏకమైనా ప్రయోజనం సున్నా
  • సామాజిక న్యాయం, బీసీ ముఖ్యమంత్రి నినాదాలను విశ్వసించని ఓటర్లు
  • భద్రాచలం, మధిరలో మాత్రమే మూడో స్థానంతో సరి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో సీపీఎం చేసిన ప్రయోగం విఫలమైంది. చిన్నాచితకా పార్టీలు మరో ఇరవై ఏడింటితో కలిసి ఏర్పాటు చేసిన బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌)ని ప్రజలు విశ్వసించలేదు. సామాజిక న్యాయం, బీసీ వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి అన్న నినాదాలతో ఈ కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లినా వారి విశ్వాసాన్ని పొందలేకపోయారు. కూటమిలో భాగంగా 26 స్థానాల్లో సీపీఎం గుర్తుపై, 81 స్థానాల్లో బహుజన వామపక్ష పార్టీ (బీఎల్‌పీ) గుర్తుపై అభ్యర్థులు రంగంలో నిలిచారు. కనీసం ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.

భద్రాచలం, మధిర స్థానాల్లో మాత్రమే కనీసం మూడో స్థానంలో నిలిచి పరువు దక్కించుకున్నారు. పైగా 2014 ఎన్నికల్లో సీపీఎం 1.5 శాతం ఓట్లు సాధించగా ఈసారి ఎన్నికల్లో ఓట్ల శాతం 0.4కి పడిపోయింది. అట్టహాసం చేసిన బీఎల్‌పీ అభ్యర్థులు కేవలం 0.7 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా ప్రభావం చూపుతారని భావించిన మిర్యాలగూడ, నారాయణపేట్‌, ఆలేరు, చెన్నూరు, కొత్తగూడెం, మహబూబాబాద్‌ స్థానాల్లో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలోనైనా ఓట్లను సాధించలేకపోయారు.  

More Telugu News