Telangana: తెలంగాణ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ పడి గెలిచింది ఇద్దరే!

  • చాలాచోట్ల గట్టిపోటీ ఇచ్చిన కొత్త అభ్యర్థులు
  • కొన్ని చోట్ల రెండు, మూడు స్థానాలకు పరిమితం
  • తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర చిత్రం

అభ్యర్థులు కొత్తవారైతే అవినీతి ఆరోపణలు తక్కువగా ఉంటాయి. అప్పటి వరకు చేసిన సేవేమీ లేదన్న అపప్రథ ఉండదు. అందుకే ఆయా రాజకీయ పార్టీలు తాము గట్టెక్కడం కష్టమనుకునేచోట, సిటింగ్‌ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్న చోట కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చి ప్రయోగాలు చేస్తుంటాయి. విజయం శాతం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కొత్త అభ్యర్థులకు ప్రజలు పెద్దగా పట్టం కట్టలేదు. అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్న ఉత్సాహంతో ఎన్నో ఆశలతో తొలిసారిగా బరిలో నిలిచిన అభ్యర్థులకు నిరాశ ఎదురైంది.

మొత్తం 12 మంది అభ్యర్థులు తొలిసారిగా పోటీ చేస్తే ఇద్దరికే అవకాశం దక్కింది. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఈయన రాజకీయాలకు కొత్తేమీ కాదు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీ. రెండో వ్యక్తి అంబర్‌పేటలో గెలిచిన కాలేరు వెంకటేష్‌. ఈయన ఏకంగా బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డిని ఓడించారు. మిగిలిన వారిలో కొందరు తాము పోటీ చేసిన స్థానాల్లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వగలిగినా రెండు, మూడు స్థానాలకే పరిమితమయ్యారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున చుండ్రు సుహాసిని పోటీచేశారు. హరికృష్ణ తనయ అయిన ఈమె నందమూరి కుటుంబం వారసురాలిగా ఈ స్థానం నుంచి బరిలో నిలిచారు. రాజకీయాలకు పూర్తిగా కొత్తయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పోటీ ఆసక్తిని రేకెత్తించింది. సెటిలర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో సుహాసిని గెలుస్తారనే దాదాపుగా అంతా అంచనా వేశారు. కానీ ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యారు.

ఇక ముషీరాబాద్‌ నుంచి పోటీచేసిన యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌, ఉప్పల్‌ నుంచి పోటీచేసిన సీనియర్‌ టీడీపీ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌లు కూడా రెండో స్థానానికే పరిమితమయ్యారు. మహేశ్వరం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్‌, ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన దాసోజు శ్రవణ్‌లు మూడో స్థానంలో నిలిచారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలో నిలిచిన మీర్జా రహ్మత్‌బేగ్‌, టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్తా ఇద్దరూ కొత్తవారే. ఈ నియోకవర్గంలో మజ్లిస్ రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో నిలిచాయి. శేరిలింగంపల్లిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ టీడీపీ తరపున వి.ఆనందప్రసాద్‌, బీజేపీ తరపున గజ్జల యోగానంద్‌ తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీపడిన సయ్యద్‌ సహేజా కూడా రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

More Telugu News