Rajasthan: రాజస్థాన్‌లో బీజేపీకి భారీ షాక్.. 20 మంది మంత్రుల ఓటమి!

  • 30 మంది మంత్రుల్లో గెలిచింది 8 మందే
  • హేమాహేమీల ఓటమి పాలు
  • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ముఖ్యమంత్రి వసుంధర రాజే సర్కారులోని 30 మంది మంత్రుల్లో ఏకంగా 20 మంది పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ అయిన 101 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీజేపీ కేవలం 73 స్థానాలు కైవసం చేసుకుని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు 19 స్థానాలు గెలుచుకోగా, బీఎస్పీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వసుంధర రాజే సహా 8 మంది మంత్రులు మాత్రమే విజయం సాధించారు. ఝల్రాపటన్ నుంచి వసుంధర రాజే, మాలవీయ్‌నగర్ నుంచి తలపడిన వైద్యశాఖా మంత్రి కాళీచరణ్ సరాఫ్, బాలీ నుంచి బరిలోకి దిగిన విద్యుత్‌శాఖా మంత్రి పుష్యేంద్ర‌సింగ్, దక్షిణ అజ్మీర్ నుంచి పోటీ చేసిన శిశు సంక్షేమశాఖా మంత్రి అనీతా భదెల్, ఉత్తర అజ్మీర్ నుంచి బరిలోకి దిగిన విద్యాశాఖా మంత్రి వాసుదేవ్ దేవ్నానీ, చూరూ నుంచి పోటీ చేసిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్, రాజ్‌సమంద్ నుంచి బరిలో ఉన్న ఉన్నత విద్యాశాఖా మంత్రి కిరణ్ మహేశ్వరి, ఉదయ్‌పూర్ నుంచి పోటీ చేసిన హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాలు మాత్రమే విజయం సాధించగలిగారు. మిగతా వారు ఘోరంగా ఓడిపోయారు.

మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిజోరంలో లోకల్ పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్ అద్వితీయ విజయాన్ని సాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను 26 స్థానాలను కైవసం చేసుకుంది.

More Telugu News