Telangana: 1821 మందిలో విజయలక్ష్మి వరించేది 119 మందినే!

  • మరో ఐదారు గంటల్లో తేలనున్న విజేతల వివరాలు
  • 10.30 గంటలకెల్లా తొలి ఫలితం
  • మధ్యాహ్నం ఒంటిగంటకు తుది ఫలితం

1821... అదేనండీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన మొత్తం అభ్యర్థుల సంఖ్య ఇది. ఇందులో అదృష్టవంతులు కేవలం 119 మంది మాత్రమే. వారు ఎవరన్నది మరో ఐదారు గంటల్లో తేలిపోతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 43 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుంది. తొలి ఫలితం ఉదయం 10.30 గంటల కెల్లా వస్తుందని అంచనా. ఆపై మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి తుది ఫలితం వచ్చేలా చూస్తామని ఇప్పటికే సీఈఓ రజత్ కుమార్ వెల్లడించారు.

ముందుగా సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్ ద్వారా వచ్చిన ఓట్లను అధికారులు లెక్కిస్తారు. ఈ విధానంలో వచ్చిన ఓటు కవర్ తెరిచిన తరువాత దాన్ని అధికారులు స్కాన్ చేస్తారు. గెజిటెడ్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ ద్వారా వారి సంతకాలను సరిచూస్తారు. ఈటీపీబీఎస్ అనంతరం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. ఆపై ఈవీఎంలను తెరుస్తారు.

లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపుకార్డు పొందిన వారికి మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించరు.

More Telugu News