Telangana: మరికాసేపట్లో లెక్కింపు ప్రారంభం.. 9 గంటలకే ఫలితాల సరళి

  • 8 గంటలకు ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
  • నేడు విజయోత్సవాలకు అనుమతి నిరాకరణ

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా గంటలోనే పోలింగ్ సరళి తెలిసిపోనుంది. తెలంగాణతోపాటు మొత్తం 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, తెలంగాణలో 119, చత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజస్థాన్‌లో ఓ అభ్యర్థి మరణించడంతో 199 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.    

ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో 40 వేల మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. 9 గంటలకల్లా పోలింగ్ సరళి ఏంటనేది తెలిసిపోనుంది. ఇక, శేరిలింగంపల్లిలో గరిష్టంగా 42 రౌండ్లు లెక్కించనుండగా, అతి తక్కువగా భద్రాచలం, అశ్వారావుపేటలలో 12 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించిన ఈసీ, విజయోత్సవాలకు కూడా అనుమతి నిరాకరించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అలాగే, సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు.

More Telugu News