modi: బీజేపీ నుంచి ఈ దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పోరాడుతుంది!: రాహుల్ గాంధీ

  • వ్యవస్థలను బీజేపీ సర్వనాశం చేసింది
  • దేశాన్ని రక్షించేందుకే మా పోరాటం
  • ఎన్డీఏ పాలనపై రాహుల్ ఫైర్

ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతి వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేసిందని, విమర్శించారు. పంజాబ్‌లోని ఓ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొని మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలోని అన్ని వ్యవస్థలపై మోదీ పెత్తనం చలాయిస్తున్నారని ఆరోపించారు.

దేశంలోని వ్యవస్థలపై జరిగిన దాడులకు కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకమని చెప్పారు. తమ లక్ష్యం బీజేపీని ఓడించడం కాదన్నారు. దేశంలోని సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. అలా చేస్తే 2019లో బీజేపీని ఓడించవచ్చన్నారు. మన్మోహన్ హయాంలో దేశాన్ని ప్రేమ, గౌరవం, మానవత్వం వంటి గుణాలతో పాలించారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం మన దేశంలో ద్వేషం, ఆగ్రహమే రాజ్యమేలుతున్నాయన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ రాజకీయ మనుగడ కోసం వీటిని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించారు.

రైతుల సమస్యలు, నిరుద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. రైతు సమస్యలు తీర్చకుండా ఈ దేశం అభివృద్ధి సాధించలేదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టును కూడా బీజేపీ వదిలిపెట్టలేదని, స్వతంత్రంగా పని చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోపక్క రాజకీయ అవసరాల కోసం ఆర్మీని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి ఈ దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి.. బీజేపీకి వారి స్థితేంటో వారికి తెలియజేస్తామన్నారు. అధికారంలోకి రాగానే రైతులు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

More Telugu News