upendra kushwaha: తీవ్ర విమర్శలతో మోదీకి ఘాటు లేఖ రాసిన కేంద్ర మంత్రి కుష్వాహా

  • కేబినెట్ ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చారు
  • మంత్రులు, ఉన్నతాధికారులను నిస్సహాయులుగా మార్చారు
  • పేదలు, అణగారిన వర్గాల కోసం మీరు పని చేయడం లేదు

కేంద్ర మంత్రి పదవికి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపించారు. ఈ సందర్భంగా మోదీకి ఆయన ఒక ఘాటు లేఖను రాశారు.

'మీ నాయకత్వంలో నేను మోసానికి గురయ్యాను. రాజ్యంగబద్ధమైన కేబినెట్ తన విధులను నిర్వహించకుండా వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం మీరు నాశనం చేశారు. కేబినెట్ ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చారు. మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా చేసి, మీ నిర్ణయాలను మాత్రమే అమలు చేసేలా చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులను నిస్సహాయులుగా చేశారు.

ప్రతి అంశానికి సంబంధించి అన్ని నిర్ణయాలను మీరు, మీ కార్యాలయం, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీసుకుంటున్నారు. పేదలు, అణగారిన వర్గాల కోసం మీరు పని చేయడం లేదు. మీ ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడం కోసమే పని చేస్తున్నారు' అంటూ ప్రధానికి రాసిన లేఖలో కుష్వాహా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, జాతీయ స్థాయిలో ఏర్పాటు కాబోతున్న మహాకూటమిలో ఆయన చేరే అవకాశం ఉంది.

More Telugu News