Telangana: ఇన్షా అల్లాహ్.. కేసీఆర్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు!: ఒవైసీ

  • ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు భేటీ
  • ఎన్నికల ఫలితాలపై చర్చించనున్న నేతలు
  • డిప్యూటీ సీఎం పోస్టుపై మజ్లిస్ కన్ను

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కలుసుకుంటానని ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దేవుడి దయతో కేసీఆర్ సొంత మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీ మద్దతుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవడం ద్వారా దేశనిర్మాణంలో తొలి అడుగు వేస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

 ‘తెలంగాణ ఆపద్ధర్మ, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సాహెబ్ ను ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కలుసుకోబోతున్నా. ఇన్షా అల్లాహ్.. ఆయన సొంత మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆయనకు అండగా మజ్లిస్ పార్టీ ఉంటుంది. దేశ నిర్మాణం అనే గొప్ప లక్ష్యం కోసం మేం వేస్తున్న తొలి అడుగు ఇది’ అని ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్ కు ఒకవేళ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే కనుక తమ మద్దతు విషయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు రెండు మంత్రి పదవులను అసద్ కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వ్యూహాత్మక భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

More Telugu News