Gujarath: విషాదం నుంచి తేరుకోవడానికి... 66 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

  • టెస్ట్‌ట్యూబ్‌ విధానంలో లేటు వయసులో సంతానం
  • రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోవడంతో ఈ నిర్ణయం
  • తొలుత వైద్యులు ఆశ్చర్యపోయినా విషాదం విని సహకారం

అరవై ఆరేళ్ల వయసులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లేటు వయసులో వారసుడి కోసం ఆమె పడిన తపన ఫలించింది. కొడుకు, కోడలితోపాటు మరో తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబం అంతులేని విషాద సాగరంలో మునిగి పోయింది. దీన్ని మర్చిపోవాలంటే వారుసుడు ఉండాలని భావించింది ఆ కుటుంబం. టెస్ట్‌ట్యూబ్‌ విధానంలో సంతానాన్ని పొంది తన ఆశ నెరవేర్చుకుంది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మధుబెన్‌ గహ్లెతా, శ్యామ్‌భాయ్‌ గహ్లెతాలు దంపతులు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి ఒక కూతురు తప్ప మిగిలిన కుటుంబం అంతా మృత్యువాత పడింది. తల్లిదండ్రులను ఈ విషాదం నుంచి బయట పడేయాలంటే వారసుడు కావాలని భావించిన కూతురు మనీషా టెస్ట్‌ట్యూబ్‌ విధానంలో సంతానం పొందాలని ప్రోత్సహించింది. తొలుత వ్యతిరేకించిన ఈ దంపతులు తర్వాత సరే అని వైద్యులను కలిశారు.

విషయం చెబితే తొలుత వారూ ఆశ్చర్యపోయారు. తర్వాత వారి విషాదగాథ విన్నాక సంతానం పొందేందుకు ఆమె పడుతున్న తపనను గుర్తించి నమ్మకంతో చికిత్స అందించారు. ‘సాధారణంగా మహిళలు 50 ఏళ్ల వయసు వరకే టెస్ట్‌ట్యూబ్‌ విధానంలో పిల్లలు పొందేందుకు అవకాశం ఉంది. మధుబెన్‌ 66 ఏళ్ల వయసులోనూ బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచారు’ అని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్‌ పూజానాడ్‌కర్ని తెలిపారు.

More Telugu News