Andhra Pradesh: నదుల అనుసంధానంతో కరవును తరిమేస్తాం.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం!: సీఎం చంద్రబాబు

  • ఏపీ అప్పుల వాటాను గణనీయంగా తగ్గించాం
  • దేశం కంటే 4 రెట్లు ఎక్కువ వృద్ధి సాధిస్తున్నాం
  • టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర జీడీపీలో అప్పుల వాటాను గణనీయంగా తగ్గించగలిగామని వ్యాఖ్యానించారు. భారత వృద్ధిరేటుతో పోల్చుకుంటే నాలుగురెట్లు వేగంగా ఏపీ ముందుకు దూసుకుపోతుందని అన్నారు. అమరావతిలో ఈరోజు నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో నీటికి కరవు ఉండదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలను సాధించామని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 22.14 శాతం అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 17.18 శాతం వృద్ధిరేటును అందుకున్నామని వెల్లడించారు. వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కాగా, టెలీకాన్ఫరెన్స్ అనంతరం చంద్రబాబు జాతీయస్థాయి నేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

More Telugu News