Vijay Mallya: విజయ్ మాల్యా భారత్ కు వచ్చేనా?.. నేడు తేల్చనున్న బ్రిటన్ కోర్టు!

  • బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా
  • 2016లో లండన్ కు పారిపోయిన మాల్యా
  • అప్పటి నుంచి అప్పగింత కేసులో విచారణ

ఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను ఇండియాకు తిరిగి పంపే విషయంలో బ్రిటన్ కోర్టు నేడు తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి. నేటి విచారణ అత్యంత కీలకమని భావిస్తున్న సీబీఐ సంయుక్త డైరెక్టర్ ఎస్ సాయి మనోహర్ బృందం ఇప్పటికే లండన్ కు చేరుకుంది. వాస్తవానికి సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా వెళ్లాల్సివుండగా, ఆయన సెలవులో ఉన్న కారణంతో మనోహర్ వెళ్లారు.

 బ్యాంకులకు రూ. 9,000 కోట్లను ఎగ్గొట్టి, 2016లో మాల్యా బ్రిటన్ కు పరారైన సంగతి తెలిసిందే. ఆయన్ను భారత్ కు అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీ అధికారులు లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టెర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించగా, విచారణ జరిగింది. నేటి తీర్పు మాల్యాకు వ్యతిరేకంగా వస్తే, ఆయన్ను లండన్ నుంచి ఇండియాకు తీసుకువచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. కోర్టు తీర్పు భారత్ కు అనుకూలంగా వస్తే, బ్రిటన్‌ హోమ్ మంత్రి మాల్యా అప్పగింతపై తుది నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. కాగా, మాల్యా సైతం వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే, వెంటనే హైకోర్టులో అప్పీలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News