Telangana: పంచమి రోజే మంచిదని.. గెలిచేది ఎవరైనా ముహూర్తం బుధవారమే!

  • రేపటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూపు
  • కూటమి గెలిస్తే కాంగ్రెస్‌కే సీఎం పీఠం
  • గెలిచిన సీట్లు ఆధారంగా మంత్రి పదవుల పంపకం

తెలంగాణలో ఎన్నికలు ముగిశాక ఇప్పుడందరూ రేపటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారో కచ్చితంగా ఓ నిర్ణయానికి రాలేకపోతున్న ముఖ్య పార్టీల నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల అనంతరం ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మరోమారు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు. ప్రజాఫ్రంట్ గెలిస్తే కనుక కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌నే ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది.

కూటమి, టీఆర్ఎస్‌లలో ఏ పార్టీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం 12నే. బుధవారం పంచమి కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడంతో బుధవారమే ప్రమాణ స్వీకారం కానిచ్చేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కూటమి కనుక విజయం సాధిస్తే మంగళవారమే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. 12న ఆ నేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందినట్టు చెబుతున్నారు.  కూటమిలోని పార్టీలు గెలిచిన సీట్లను బట్టి మంత్రి పదవుల పంపకం ఉంటుందని సమాచారం.

More Telugu News