Andhra Pradesh: ఏపీ ప్రయాణికుల బోగీలను ఆక్రమించుకున్న బిహారీలు.. దిగబోమంటూ దౌర్జన్యం!

  • రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఘటన
  • పట్నా-యర్నాకుళం బోగీల ఆక్రమణ
  • ఎట్టకేలకు బిహారీలకు నచ్చజెప్పిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప మాలధారులైన ప్రయాణికులకు బిహార్ ప్రయాణికులు చుక్కలు చూపించారు. పట్నా నుంచి యర్నాకుళం వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో రిజర్వేషన్ బోగీలను బిహారీలు ఆక్రమించుకున్నారు. తాము ఈ బెర్తులను రిజర్వ్ చేసుకున్నందున దిగాలని ప్రయాణికులు కోరగా, అందుకు బిహారీలు ససేమీరా అన్నారు. దీంతో చివరకు ఏపీ ప్రయాణికులు రాజమండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజమండ్రి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.  

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. బిహార్ ప్రయాణికులను దిగాల్సిందిగా కోరారు. అయితే తాము అధికారులకు జరిమానా చెల్లించామనీ, రిజర్వేషన్ బోగీ నుంచి దిగబోమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు వీరిని బలవంతంగా రైలు నుంచి దించారు. పోలీసుల చర్యతో ఆగ్రహానికి లోనైన బిహారీలు.. రైలు ఇంజన్ ముందు నిలబడి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ‘మిమ్మల్ని మరో రైలులో పంపుతాం’ అని అధికారులు హామీ ఇవ్వడంతో బిహారీలు వెనక్కి తగ్గారు. దీంతో ఏపీ ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటూ కేరళకు బయలుదేరారు.

More Telugu News