Telangana: సౌదీలో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు.. సోషల్ మీడియాలో స్పందించిన కేటీఆర్!

  • సౌదీలో తెలంగాణవాసుల్ని మోసం చేసిన కంపెనీ
  • జైళ్లలో మగ్గుతున్న 25 మంది కార్మికులు
  • 45 రోజులుగా నరకం అనుభవిస్తున్నామని వెల్లడి

తెలంగాణ నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన కొందరు కార్మికులు కంపెనీ మోసం చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉన్నందుకు సౌదీ అధికారులు వారిని జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో తమను కాపాడాలని వారంతా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణకు చెందిన 20-25 మంది ఇక్కడ చిక్కుకున్నామని అందులో తెలిపారు. కంపెనీ మోసం చేయడంతో గత 45 రోజులుగా జైలులో నరకం అనుభవిస్తున్నామనీ, తమకు అనారోగ్యం వస్తే ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా స్పందించడం లేదని వాపోయారు. ‘దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడండన్నా’ అని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టును రవికిరణ్ సంజూ అనే యువకుడు రీట్వీట్ చేయడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు.

సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలంగాణ వాసుల విషయంలో తాము చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. సౌదీలో ఉన్న కార్మికులను జాగ్రత్తగా తీసుకొస్తామనీ, భయపడవద్దని సూచించారు.

More Telugu News