Telangana: మెట్ పల్లిలో నాపై హత్యాయత్నం జరిగింది.. 3 రోజుల ముందే స్కెచ్ వేశారు!: మధుయాష్కీ

  • హత్యా యత్నం తర్వాత కవిత స్థానిక నేతలతో మాట్లాడారు
  • కేసీఆర్ పాలనకు చరమగీతం పాడబోతున్నారు
  • గాంధీభవన్ లో మాట్లాడిన కాంగ్రెస్ నేత

తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిని అధికార టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా వేధించిందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించినా ప్రజలు వాటికి లొంగలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో శాంతియుతంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లికి వెళ్లినప్పుడు తనపై పక్కా ప్రణాళికతో హత్యాయత్నం జరిగిందని మధుయాష్కీ ఆరోపించారు. ఇందుకోసం దుండగులు 3 రోజుల ముందే స్కెచ్ వేసి ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో పెట్రోల్ బాంబులు, రాడ్లతో తనను హతమార్చే కుట్ర జరిగిందని తెలిపారు. అయితే అదృష్టం కొద్దీ తాను ఈ దాడి నుంచి తప్పించుకోగలిగానని వ్యాఖ్యానించారు.

ఈ దాడి జరగగానే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడారని వెల్లడించారు. పోలింగ్ సందర్భంగా వంశీచంద్ రెడ్డి సహా పలువురిపై దాడులు జరగడం దారుణమన్నారు. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణను అప్రజాస్వామికంగా పాలించిన కల్వకుంట్ల కుటుంబానికి నిన్నటి ఎన్నికలతో కాలం చెల్లిందని మధుయాష్కీ వ్యాఖ్యానించారు.

More Telugu News