Jagan: వైసీపీలో చేరిన హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే

  • పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలిసిన అబ్దుల్ ఘనీ
  • స్వాగతించి కండువా కప్పిన వైఎస్ జగన్
  • టీడీపీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఘనీ ఆరోపణ

హిందూపురం మాజీ ఎమ్మెల్యే, ఈ ప్రాంతంలో మంచి పట్టున్న తెలుగుదేశం నేత అబ్దుల్ ఘనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ వద్దకు వచ్చిన ఘనీ, పార్టీలో చేరారు. ఘనీని ఆహ్వానించిన జగన్, ఆయనకు పార్టీ కండువాను కప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అబ్దుల్ వంటి ప్రజా నాయకుడు పార్టీలో చేరడంతో హిందూపురం ప్రాంతంలో వైకాపా మరింతగా బలపడిందని అన్నారు.

 ఇదే సమయంలో ఘనీ స్పందిస్తూ, నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో మూడు దశాబ్దాలుగా తాను పనిచేశానని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని, ఆయన ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలిచిందని అన్నారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం స్థానాన్ని అబ్దుల్ ఘనీ ఆశించగా, ఆ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణను టీడీపీ బరిలోకి దింపిందన్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లోనూ ఆయనకు టీడీపీ టికెట్ లభించే  అవకాశాలు లేకపోవడంతోనే, ఆయన పార్టీని వీడారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News