Hyderabad: ఈ నగరానికి ఏమైంది?... ఓటేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాదీ!

  • అతి తక్కువగా నమోదైన పోలింగ్ శాతం
  • మలక్ పేటలో 40 శాతం పోలింగ్
  • తగ్గిన పోలింగ్ తో అభ్యర్థుల్లో కలవరం

భాగ్యనగరం బద్ధకించింది. తమ భవిష్యత్తును నిర్దేశించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు నగర వాసులు ముందుకు రాలేదు. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. నగర ఓటర్లలో సగం మంది కూడా తమ హక్కును వినియోగించుకోలేదు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిన్న పోలింగ్ సాగగా, అత్యల్ప ఓటింగ్ శాతం హైదరాబాద్ లోనే నమోదైంది.

మొత్తం 46 నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గగా, మలక్ పేటలో కేవలం 40 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటేశారు. గతంతో పోలిస్తే, చార్మినార్, మలక్ పేట, యాకత్ పురా తదితర ప్రాంతాల్లో 10 శాతం కన్నా ఓటింగ్ శాతం తగ్గడం బరిలో ఉన్న అభ్యర్థులను తీవ్రంగా కలవరపెడుతోంది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.

మలక్ పేటలో 40 శాతం, ఎల్బీ నగర్ లో 42 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఉప్పల్ లో దాదాపు 50 శాతం పోలింగ్ జరుగగా, ఇప్పుడది 43.36 శాతానికి తగ్గింది. కుత్బుల్లాపూర్ లో పోలింగ్ శాతం 48.36 నుంచి 44.05కు తగ్గింది.

ఇక ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన కూకట్ పల్లిలో మాత్రం ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2014 ఎన్నికల్లో నమోదైన 49.42 శాతం పోలింగ్ ఈ దఫా 50.20 శాతానికి చేరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 5 చోట్ల 50 శాతంలోపే ఓటింగ్‌ జరిగింది.

More Telugu News