lagadapati: జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ గతంలో నిజం కాలేదు.. నేను చెప్పిందే జరిగింది: లగడపాటి

  • ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు చాలా తేడా ఉంటుంది
  • ఏపీ, తమిళనాడు, కర్ణాటకల ఫలితాలను అంచనా వేయడంలో జాతీయ సంస్థలు విఫలమయ్యాయి
  • ప్రలోభాలు, డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది

తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించిన జాతీయ సంస్థల ప్రతినిధులంతా తనకు తెలుసని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. వారంతా తమిళనాడు ఎన్నికల్లో సరైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోయారని, కర్ణాటకలో మిస్ అయ్యారని, ఏపీలో తప్పుడు ఫలితాలను వెలువరించారని ఆయన అన్నారు. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి సరైన ఫలితాలను వెల్లడించింది తానేనని చెప్పారు.

దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి చాలా తేడా ఉంటుందని... సౌతిండియా రాష్ట్రాలను ఒక ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ రాష్ట్రాల్లో ప్రలోభాలు, డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని... ఇలాంటి పరిస్థితుల్లో ఏ 10 వేల మందో లేదా 20 వేల మందో అభిప్రాయాలను సేకరించి ఫలితాలను అంచనా వేయలేమని చెప్పారు.

ఆగస్టు 20 నుంచి తాము తెలంగాణలో సర్వేను చేస్తున్నామని మాజీ ఎంపీ లగడపాటి తెలిపారు. దాదాపు 100 సెగ్మెంట్స్ లో అనేక పర్యాయాలు తాము సర్వే చేశామని చెప్పారు. ప్రలోభాలకు ఓటింగ్ ఎలా మారుతోందో చూశామని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలోనే, తెలంగాణ నాడి హస్తానికి చిక్కిందని స్పష్టంగా చెప్పగలనని అన్నారు. గత రెండు రోజుల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉందని... దీన్ని అంచనా వేయడానికి తనకు రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలిపారు. 

More Telugu News