Duterte: బిషప్‌ల వల్ల దేశానికి ఉపయోగం లేదు.. వారిని చంపేయండి: సహనం కోల్పోయిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

  • డ్రగ్స్‌పై యుద్ధం పేరుతో అమాయకులను కాల్చేస్తున్న ప్రభుత్వం
  • తప్పుబట్టిన కేథలిక్ చర్చిలు
  • పనికిమాలిన చర్చిలంటూ డ్యుటెర్టె ఆగ్రహం

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మరోమారు అటువంటి వ్యాఖ్యలే చేశారు. కేథలిక్ బిషప్‌ల వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని, వారు ‘యూస్‌లెస్ ఫూల్స్’ అని పేర్కొన్నారు. ఎందుకూ పనికిరాని ఇటువంటి వారిని చంపి పడేయాలన్నారు. దేశంలోని కేథలిక్ చర్చిలన్నీ కపట సంస్థలని ఆరోపించారు.

దేశంలో మాదక ద్రవ్యాల వినియోగంపై డ్యుటెర్టె ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. మాదక ద్రవ్యాలతో కనిపించిన వారిన కాల్చి పడేయాలని గతంలో సంచలన ఆదేశాలు జారీ చేశారు. పోలీసులకు తాను అండగా ఉంటానని, డ్రగ్స్‌తో పట్టుబడితే ఎటువంటి సంశయమం లేకుండా కాల్చేయాలని సూచించారు.

అధ్యక్షుడి ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు ఇప్పటి వరకు 5 వేల మందిని కాల్చి చంపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేథలిక్ చర్చలు అధ్యక్షుడి చర్యలను తప్పుబట్టాయి. డ్రగ్స్‌పై యుద్ధం పేరుతో ప్రజలను పిట్టల్లా కాల్చి పడేస్తున్నారని ఆరోపించాయి. తనపై చర్చిలు చేస్తున్న విమర్శలపై స్పందించిన అధ్యక్షుడు డ్యటెర్టె.. అవో పనికిమాలిన చర్చిలని, కేథలిక్ బిషప్‌లను కాల్చి పడేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

More Telugu News