Anantapur District: ‘అనంత’ కరవుని తరిమికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా వ్యవసాయ విధానం తెస్తాం: పవన్ కల్యాణ్

  • ఇజ్రాయిల్ లో నేల సారం ఉండదు
  • అయినప్పటికీ వారు కరవుని జయించారు
  • ఆధిపత్య పోరు కూడా ఇక్కడి కరవుకి ఓ కారణం

అనంతపురం జిల్లా నుంచి కరవుని తరిమికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తెస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ‘అనంతపురం కరవు-వలసలు’ అంశంపై స్థానిక సెవన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్న దుర్భర పరిస్థితులపై జనసేన పార్టీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఇజ్రాయిల్ లో నేల సారం ఉండదని, అయినప్పటికీ, టెక్నాలజీని వినియోగించుకుని వారు కరవుని జయించారని అన్నారు. కేవలం, వెయ్యి గజాల్లో నలుగురికి సరిపడా ఆహారాన్ని వారు పండిస్తున్నారని, అదే తరహా టెక్నాలజీతో ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నిరుపయోగంగా ఉన్న సెజ్ భూముల్లో ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు.

ఈ జిల్లాకు సంబంధించిన మరో తీవ్ర సమస్య వలసలు పోవడమని, వలస కార్మికులు దళారులని నమ్మి దుబాయ్ లాంటి ప్రదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. రాయలసీమలో బలమైన నాయకులు ఉన్నారు కానీ, కరవుని మాత్రం పారద్రోలలేకపోతున్నారని, అనంతపురంలో ఆధిపత్య పోరు కూడా ఇక్కడి కరవుకి ఓ కారణమని అన్నారు. శింగనమల నియోజకవర్గం నుంచి తాను వస్తున్నప్పుడు పంట పొలాలను పరిశీలించానని, ఆ పొలాల పక్కనే కాలువ ఉన్నా నీరు ఎప్పుడు వస్తుందో రైతులకే తెలియని పరిస్థితి అని, ఇక్కడి నుంచి పులివెందులకు నీరు వెళ్తుందని అన్నారు.

More Telugu News