Ramesh Dube: డబ్బిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తాం.. కాంగ్రెస్ అభ్యర్థికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్!

  • అనుకూలంగా ఫలితాలొచ్చేలా చూస్తాం
  • ఒక్కో ఈవీఎంకి రూ.2.5 లక్షలు
  • గ్వాలియర్‌కు అభయ్ జోషి
  • అరెస్ట్ చేసిన పోలీసులు

డబ్బిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తామని చెప్పి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంచలనం రేపారు. ఇప్పటికే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఈ వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. మధ్యప్రదేశ్‌లోని బింద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ దూబేకు ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్ చేసి ఈవీఎంలలో మీకు అనుకూలంగా ఫలితాలొచ్చేలా చూస్తామని.. దీనికి ఒక్కో ఈవీఎంకి రూ.2.5 లక్షల చొప్పున తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆ వ్యక్తిని రమేశ్.. మధ్యప్రదేశ్‌కు రమ్మన్నారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు.

ట్యాంపరింగ్ విషయమై మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి అభయ్‌ జోషి (30) అనే వ్యక్తి గ్వాలియర్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రమేశ్‌ కూడా అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. తాము ఏ విధంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారో రమేశ్‌కు అభయ్‌ వివరించాడు. తన సెల్‌ఫోన్‌లో ఇందుకు సంబంధించిన ఓ దృశ్యాన్ని కూడా చూపించాడు. ఇందుకు ఒక్కో ఈవీఎంకు 2.5 లక్షలు తీసుకుంటామని తెలిపాడు.

ఇంతలోనే రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై గ్వాలియర్‌ ఎస్పీ నవనీత్‌ భాసిన్‌ మాట్లాడుతూ... జోషిని విచారిస్తున్నామని, పోలీసులను ఢిల్లీకి పంపి అతని ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తామన్నారు. డబ్బు కోసమే అభ్యర్థులను ట్యాంపరింగ్ పేరుతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు.

More Telugu News