nalgonda: ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోకుండా ఓటు వేయండి: నల్గొండ ఎస్పీ రంగనాథ్

  • ఉమ్మడి నల్గొండలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశాం
  • 410 సమస్యాత్మక బోలింగ్ బూత్ లు ఉన్నాయి
  •  వీటి వద్ద పారామిలిటరీ బలగాలను మోహరిస్తాం

డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా, తమ ఆత్మాభిమానాన్ని అమ్ముకోకుండా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక్కడ మొత్తం 1629 పోలింగ్ బూత్ లు ఉన్నాయని, వీటిల్లో 410 సమస్యాత్మక పోలింగ్ బూత్ లని అన్నారు.

 వీటి వద్ద పారామిలిటరీ బలగాలను మోహరిస్తామని, అంతేకాకుండా, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పోలీస్ సిబ్బందిని, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ని కూడా వినియోగిస్తున్నామని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే మొబైల్ టీమ్స్ అక్కడికి వెళ్లే విధంగా, కమాండ్ సెంటర్ నుంచి తాము ఆదేశాలు ఇస్తామని  చెప్పారు. మద్యం సేవించి ఎవరైనా ఓటు వేసేందుకు వస్తే చర్యలు తప్పవని, అవసరమైతే కేసు నమోదు చేస్తామని, మద్యం సరఫరా చేసిన వ్యక్తిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

More Telugu News