Telanganaa: ‘సార్.. ఈ ఇంట్లో రూ.200 కోట్లు ఉన్నాయ్’ అంటూ నంద్యాల డీఎస్పీని బురిడీ కొట్టించిన ఆకతాయి.. సీరియస్ గా తీసుకున్న పోలీసులు!

  • మరో చోటుకు తీసుకెళ్లబోతున్నారని ఫోన్
  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
  • భారీసంఖ్యలో చేరుకుని తనిఖీలు నిర్వహించిన అధికారులు

సాధారణంగా  రైలు లేదా విమానంలో బాంబు ఉందని ఆకతాయిలు అధికారులకు ఫోన్ చేసి ఆట పట్టిస్తుంటారు. కానీ ఈసారి ఓ వ్యక్తి ఏకంగా డీఎస్పీకి ప్రాంక్ కాల్ చేసి ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో పోలీస్ అధికారులు సదరు ప్రబుద్ధుడి కోసం కొంచెం గట్టిగానే గాలింపు చేపట్టారు. కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణకు నిన్న ఓ ఆకతాయి ఫోన్ చేశాడు. ‘సార్.. నంద్యాల దగ్గరున్న పెద్దకొట్టాల గ్రామంలో ఓ ఇంట్లో రూ.200 కోట్లు దాచి ఉంచారు. మీరు వచ్చి వెంటనే స్వాధీనం చేసుకోండి. వీళ్లు ఈ మొత్తాన్ని మరో చోటుకి తీసుకెళ్లబోతున్నారు. వెంటనే రండి సార్’ అంటూ పేరు చెప్పకుండానే కాల్ కట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ సమాచారం నిజమై ఉంటుందని నమ్మిన డీఎస్పీ గోపాలకృష్ణ.. నంద్యాల అర్బన్ సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు, రెవిన్యూ అధికారులతో కలిసి ఒక్కసారిగా పెద్దకొట్టాల గ్రామాన్ని చుట్టుముట్టారు. అనంతరం ఫోన్ లో చెప్పిన ప్రకారం సదరు ఇంటిలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు.

పోలీసులు, రెవిన్యూ అధికారులు సడెన్ గా ఊరిలోకి వచ్చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. సదరు ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలోనూ అధికారులు చాలాసేపు తనిఖీలు చేపట్టి ఏమీ లేదని తేల్చారు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ప్రాంక్ కాల్ కారణంగా తమ పనులను వదిలేసుకుని రావాల్సి వచ్చిందనీ, అనవసరంగా ప్రజాధనం వృథా అయిందని వ్యాఖ్యానించారు. ఈ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామనీ,  అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News